అంతా ఊహించినట్లే జరిగింది. ఏపీ సీఎం జగన్ ఆటలో వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పావులాగా మారారు. జగన్ ‘నాటకం’లో ఊహించినట్లుగానే ‘అమ్మ’ రాజీనామా చేశారు. తాజాగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ తన రాజీనామాను ప్రకటించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి, వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని వేదికపై సంచలన ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా విజయమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు జగన్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తాను పార్టీకి అండగా ఉన్నానని చెప్పారు. అయితే, ఇపుడు తన కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి తన తండ్రి వైఎస్ ఆశయాల సాధన కోసం పోరాడుతోందని అన్నారు. అందుకే, తన కూతురికి అండగా ఉండేందుకు తాను తెలంగాణలో ఉండబోతున్నానని చెప్పారు.
తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు తన అండ అవసరమని ఆమె అన్నారు. తన కొడుకుని మీ అందరి చేతుల్లో పెడుతున్నానని ప్లీనరీకి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు. తల్లిగా జగన్ కు ఎప్పుడూ తన మద్దతుంటుందని అన్నారు. కుటుంబంలో మనస్పర్థలున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దానికి ముగింపు పలికేందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.
అయితే, విజయమ్మ రాజీనామాపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన కొడుకును ఏపీ మీదకు వదిలిన విజయమ్మ ఇపుడు రాష్ట్రం సర్వ నాశనం అవుతున్న తరుణంలో తెలంగాణకు వెళ్లిపోతున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక, తెలంగాణపై తన కూతురుని వదిలారని, అక్కడ కూడా ఏపీ మార్క్ రాజకీయాలు చేసేందుకు మకాం మార్చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఇదంతా జగన్ నడిపిస్తున్న డ్రామా అని, జగన్ ‘నాటకం’లో ‘అమ్మ’ రాజీనామా ఎపిసోడ్ హైలైట్ అని సెటైర్లు వేస్తున్నారు.