దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి మరో నాలుగు రోజుల్లో ఉంది. ఆయన మరణించి 12 ఏళ్లు అయ్యింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు వైఎస్ సతీమణి విజయమ్మ.
సెప్టెంబరు 2న వైఎస్ వర్థంతిని పురస్కరించుకొని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు హైదరాబాద్ మహానగరం వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆయనకు ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన నేతలందరికి విజయమ్మ స్వయంగా ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది.
రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్య్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ ఆమె కోరుతున్నారు. ఇందులో భాగంగా అప్పటి వైఎస్ సన్నిహితులకు విజయమ్మ స్వయంగా ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. సెప్టెంబరు 2న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరినట్లుగా చెబుతున్నారు.
ఈ ప్రోగ్రాంకు హాజరు కావాలంటూ విజయమ్మ ఫోన్ చేసిన ప్రముఖుల్లో కేవీపీ రామచంద్రరావు.. ఉండవల్లి అరుణ్ కుమార్.. మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్.. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డితో పాటు వైఎస్ కేబినెట్ లో పని చేసిన ప్రతి ఒక్కరిని పిలిచినట్లుగా తెలుస్తోంది.
భారీ ఎత్తున వైఎస్ విధేయుల్ని.. శ్రేయోభిలాషుల్ని ఆహ్వానిస్తున్న విజయమ్మ.. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏం చేయనున్నారు? ఆమె ఎజెండా ఏమిటి? వైఎస్ ఇమేజ్ ను గతానికి భిన్నంగా ఇప్పుడీ ప్రత్యేక ఫోన్ ఆహ్వానం ఏమిటి? అసలు ఎజెండా ఏమిటి? అన్న ప్రశ్నలు పలువురిని తొలిచేస్తున్నాయి. వీటికి సంబంధించిన క్లారిటీ రావాలంటే.. సెప్టెంబరు 2 వరకు వెయిట్ చేయక తప్పదన్న మాట వినిపిస్తోంది.