తిరుపతి ఉప ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు వైసీపీ సర్కార్ ను ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. స్వయంగా ఏపీ సర్కార్, జగన్ పై వైఎస్ సునీత పరోక్ష ఆరోపణలు చేయడంతో జగన్ అండ్ ఫ్యామిలీ డిఫెన్స్ లో పడ్డారు. అయితే, బాబాయ్ హత్య గురించి జగన్ చాలా బాధపడుతున్నారని, సీబీఐ విచారణకు ఆదేశించారని వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాసి కొంత డ్యామేజీని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మపై తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. వైఎస్ విజయమ్మ నేటి గాంధారి అని, తొలుత సీబీఐ విచారణ వద్దంటూ జగన్ చెప్పిన సంగతి విజయలక్ష్మికి కన్పించలేదా అని పట్టాభి ప్రశ్నించారు. తన కళ్లకు కట్టిన గంతలను విజయమ్మ తీసేసి సునీత పిటిషన్ ను చూడాలని చురకలంటించారు. దోషులను కాపాడాలని జగన్ సిట్‌ను పదే పదే మార్చిన విషయాన్ని విజయమ్మ చూడాలని, ఆ తర్వాత ఈ విషయాలపై ఆమె సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలను చార్జ్‌షీట్‌లో చేర్చిన సంగతి విజయమ్మకు కన్పించలేదా? అని పట్టాభి ప్రశ్నించారు. జగన్ పాలనలో తనకు రక్షణ లేదని సునీత చెప్పిన మాటలు విజయలక్ష్మికు వినిపించ లేదా అని పట్టాభి ప్రశ్నించారు. సునీతకు తమ మద్దతు ఉందని చెప్పే విజయలక్ష్మి….సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో సునీతమ్మ గళాన్ని ఏనాడైనా విన్పించారా అని నిలదీశారు.
సునీతమ్మకు మంచి న్యాయవాదిని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కోడికత్తి కేసులో డ్రామాలు ఆడి ఆ ఎపిసోడ్ ను రక్తికట్టించిన ఇద్దరు తెలంగాణ రెడ్డి వైద్యులకు ఏపీలో కీలక పదవులు ఎందుకు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.సొంత చెల్లెళ్లకే జగన్ వెన్నుపోటు పొడిచాడని పట్టాభి విమర్శలు గుప్పించారు. మరి, పట్టాభి విమర్శలపై విజయమ్మ, వైసీపీ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.