2019 ఎన్నికల సమయంలో ప్రతి అంశం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కు కలిసొచ్చింది. చాలామంది ఆయన వెంట నడిచారు. కానీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఏపీని పరిపాలించాక ఇప్పుడు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పుడు కలిసొచ్చిన అంశాలే ఇప్పుడు ప్రతికూలంగా మారుతున్నాయి. కుటుంబ సభ్యులు సైతం ఆయనకు దూరం అయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు కొంతమేర సానుభూతి తీసుకొచ్చి, చంద్రబాబుకు మైనస్ అయిన వివేకానందరెడ్డి హత్య వ్యవహారం ఇప్పుడు జగన్ అండ్ కోకు పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది.
వివేకా తనయురాలు సునీత ఇప్పుడు జగన్, అవినాష్‌ల మీద తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ ఓ సభలో తన బాబాయి హత్య గురించి చేసిన వ్యాఖ్యలపై ఆమె మీడియా ముందుకొచ్చి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘‘వివేకాను చంపిందెవరో దేవుడికి, కడప జిల్లా ప్రజలకు తెలుసని జగనన్న అన్నారు. జిల్లా ప్రజలంటే మీరు కూడా అందులో ఒకరు కదా? అలాంటపుడు హత్య ఎవరు చేశారో? ఎవరు చేయించారో మీకు తెలిసినట్లే కదా. అది ఎందుకు బయటపెట్టడం లేదు. చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపై ఉంది. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి.
ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంత భయం దేనికి? నేరుగా మాట్లాడాలంటే చెప్పండి. నాకు అభ్యంతరం లేదు. మీ సాక్షి ఛానెల్‌కే వస్తా. డిబేట్లో పాల్గొందాం. ఎమోషనల్ మాటలతో ప్రతిసారీ అందరినీ మోసం చేయలేరు. గతంలో మిమ్మల్ని నమ్మి గుడ్డిగా చెప్పిందల్లా చేశాను. కానీ తప్పును గ్రహించి దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చింది’’ అని సునీత అన్నారు.
కడప ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న షర్మిళకు సునీత పూర్తి మద్దతు ప్రకటించారు. జగన్ జైల్లో ఉండగా షర్మిళ చేసిన పాదయాత్ర వల్లే వైసీపీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచారని.. ఐతే కష్టపడి వైసీపీని నిలబెట్టి షర్మిళ పవర్ ఫుల్ అవుతుందని భయపడే జగన్ ఆమెను పక్కన పెట్టారని సునీత ఆరోపించారు.