ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ హత్య కలకలం రేపింది. అయితే, వివేకా వంటి హై ప్రొఫైల్ వ్యక్తి హత్య జరిగి మూడేళ్లు పూర్తయినా…అసలు దోషులెవరన్నది తేలలేదు. దీంతో, ఈ కేసు విచారణపై వివేకా కుమార్తె సునీతారెడ్డి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కొద్ది నెలల క్రితం ఢిల్లీలో జగన్ పై సునీత సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. జగన్ సీఎంగా ఉన్నా కేసు విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందో జగన్ నే అడిగితే బాగుంటుందని ఓ విలేకరికి సునీత చెప్పడం సంచలనం రేపింది. ఇక, ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ కేసు విచారణ నెమ్మదిగా సాగుతోంది. తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న కసితో ఉన్న సునీత…పలుమార్లు సీఐడీ అధికారులను కలిశారు.
అయితే, తన తండ్రి హత్యకు కారకులైనవారిని పట్టుకోవడంలో అన్న జగన్ అలసత్వం ప్రదర్శించడంతో టీడీపీ టిక్కెట్‌పై కడప నుంచి పోటీ చేసేందుకు సునీత రెడీ అవుతున్నారని గతంలో సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ కామెంట్లపై సునీత స్పందించలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ పుకారు పులివెందులలోషికారు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున సునీతను పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట.
అందుకే, జగన్ వచ్చే ఎన్నికల్లో జమ్మల మడుగుకు మారి పులివెందుల టిక్కెట్‌ను సునీతకు ఇస్తారని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి.అయితే, సునీత సన్నిహితులు మాత్రం .. తన తండ్రి హంతకులకు శిక్ష పడాలన్న ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నారు కానీ రాజకీయ ఆశలతో కాదని అంటున్నారు.