వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత ఎన్నికలకు ముందు మరోసారి గళం వినిపించనున్నారు. గత ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి దారుణ హత్య జరి గిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఇప్పటి వరకు న్యాయపోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు వెనుక ఎవరున్నారు? ఏం జరుగుతోంది? అనే విషయాలను కూడా ఆమె తరచుగా చెబుతున్నారు. అంతేకాదు.. సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు కూడా పోరాటం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆమెకు అనేక బెదిరింపులు.. కూడా వచ్చాయి. ఇటీవలే ఆమె హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. నిన్ను లేపేస్తాం.. మాకో లెక్కకాదు.. అంటూ ఆమెకు బెదింరిపు సందే శాలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే.. మరోసారి దేశం దృష్టికి ఈ కేసును తీసుకు రావాలన్న ఉద్దేశంతో సునీత ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం 11 గంటల కు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతున్నారు.
సాధారణంగా.. నాయకులు పెట్టే ప్రెస్ మీట్లు కామనే. అయితే.. సునీత ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ప్రెస్ మీట్‌కు చాలా వరకు ప్రాధాన్యం ఏర్పడింది.బుధవారమే వివేకానంద కేసులో.. నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరెడ్డి వంటివారికి కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇక, ఇదే కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ను కూడా తెలంగాణలోని సీబీఐ కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో సునీత ఏర్పాటు చేయనున్న ప్రెస్ మీట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు.. ఎన్నికలు సమీపిస్తుండడం.. ఆమెను రాజకీయాల్లోకి రావాలంటూ.. కొందరి నుంచి ఆహ్వానాలు అందుతున్న క్రమంలో కూడా.. ఆమె ఎలాంటి సంచలన ప్రకటనలు చేయనున్నారనే విషయం కూడా ఆసక్తిగా మారింది. మరి ఏం చెబుతారో చూడాలి. ఇప్పటికైతే.. సునీత మీడియా సమావేశానికి సంబంధించిన టాక్ హాట్‌హాట్‌గా మారింది.