మన దేశంలో అన్నా చెల్లెలి అనుబంధానికి చాలా గుర్తింపు ఉంది….ఏ దేశంలో లేని విధంగా అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా రాఖీ పండుగను మనం ఘనంగా జరుపుకుంటాం. నాన్న తర్వాత అన్నకే ఆ స్థానాన్ని ఇస్తుంటారు …ఇంకా చెప్పాలంటే నాన్నకు కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలను అన్నయ్యతో పంచుకుంటారు….ఆపద వస్తే ఆదుకోవడానికి అన్న ఉన్నాడన్న ధైర్యం చాలామంది చెల్లెళ్లకు ఉంటుంది.
అదే ధైర్యంతో, నమ్మకంతో….సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ సునీతా రెడ్డి తన అన్నను ఆశ్రయించి సాయం కోరింది. తన తండ్రి హత్యకు గురై…షాక్ లో ఉన్న సమయంలో ఆదుకోవాలని, హత్య కేసు నిందితులెవరో తేల్చాలని ప్రాధేయపడింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ…కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందులలో జగన్ కు చాలా స్థానబలం ఉంది. వివేకాను చంపిందెవరో కనిపెట్టి శిక్ష పడేలా చేయడం జగన్ కు చిటికెలో పని. కానీ, సాయం కావాలి అన్నా…అంటూ పుట్టెడు దు:ఖంతో తన దగ్గరకు వచ్చిన చెల్లెలు సునీతతో జగన్ చెప్పిన మాటలు వింటే…ఎవ్వరైనా షాక్ కు గురవ్వాల్సిందే.
‘‘మా నాన్నను ఎవరు చంపారో పులివెందులలో చాలా మందికి తెలుసు.. హంతకులెవరో తేల్చాలని అన్న(జగన్)ను కోరా.. అనుమానితుల పేర్లూ చెప్పా.. వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్.. నీ భర్తే హత్య చేయించాడేమోనని అన్యాయంగా మాట్లాడారు.. అయితే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని సవాల్ చేశా.. సీబీఐకి ఇస్తే ఏమవుతుంది..? అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. 11 కేసులకు మరొకటి తోడై12 కేసులు అవుతాయ్” ఇది నాటి ప్రతిపక్ష నేత, నేటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురించి సీబీఐ అధికారులకు వైఎస్ సునీతా రెడ్డి ఇచ్చిన సంచలన వాంగ్మూలం.
2020 జూలై 7న సీబీఐ అధికారులకు సునీత స్వయంగా ఇచ్చిన వాంగ్మూలం ఇది. జగన్ పై స్వయంగా సునీత చెప్పిన మాటలు విని ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. హత్య జరిగిన రోజు కూడా వివేకా మరణించారని మొదట భారతికి, తర్వాత జగన్‌కు ఫోన్ చేసి చెబితే.. అవునా అంటూ చాలా తేలిగ్గా స్పందించారని, ఆశ్చర్యం, బాధలాంటివి కొంతైనా కనిపించలేదని సునీత షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. రాజకీయంగా తన తండ్రి వివేకాపై కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కక్ష పెంచుకున్నారని చెప్పారు.
హత్య జరిగిన రోజు తన భర్తకు వివేకా సన్నిహితుడు ఎంవీ కృష్ణారెడ్డి ఫోన్ చేసి కేసు పెట్టమంటారా.. అని అడిగారని, ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ ఎన్ని సార్లు చేసినా ఎత్తలేదని వెల్లడించారు. దీంతో, తాము పులివెందుల వచ్చేదాకా పోస్టుమార్టం చేయొద్దని చెప్పామని, కానీ, హడావిడిగా పోస్టుమార్టం పూర్తి చేసి కుట్లేసి కట్టు కట్టేశారని వాపోయారు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. వైఎస్ భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ఆదేశాలతో ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని తెలిసిందని అన్నారు.
ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టొద్దని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని తెలిసిందని, దీంతో, సీఐ శంకరయ్యకు తన భర్త రాజశేఖర్‌రెడ్డి ఫోన్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్పారని సునీత వాంగ్మూలమిచ్చారు. హత్య జరిగిన రోజే పోస్టుమార్టం, అంత్యక్రియలు అయిపోవాలని కొందరు హడావుడి చేస్తున్నారని, దీంతో అమ్మ ఒకసారి విషయం జగన్‌కు చెప్పమనడంతో జగన్ అన్నకు ఫోన్ చేశానని చెప్పారు. తాను చూసుకుంటానని జగన్ చెప్పారని సునీత వాంగ్మూలమిచ్చారు. తాజాగా బయటకు వచ్చిన సునీత వాంగ్మూలం సంచలనం రేపుతోంది.