తన తండ్రి, దివంగత నేత వైఎస్ఆర్ జయంతి నాడు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరును ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిష్కరణ సభలో పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు. తమది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని షర్మిల వెల్లడించారు. వైఎస్సార్ టీపీ జెండాను ఆమె తల్లి విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు, 20 శాతం నీలిరంగు, మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటం.. ఆ మధ్యలో రాజశేఖర్రెడ్డి బొమ్మ ఉండేలా జెండాను రూపొందించారు.
పార్టీ ఆవిర్భార సభలో ప్రసంగించిన వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ బిడ్డలు దొంగలు, గజదొంగలు కాదని, మాటిస్తే ముందుకెళ్లడం తండ్రి నుంచి నేర్చుకున్న వారని విజయమ్మ అన్నారు. మాటలు మార్చడం వారికి తెలియదని.. మాటకు ప్రాణం ఇచ్చేవారని అన్నారు. వైఎస్ కుటుంబానికి దాచుకోవడం, దోచుకోవడం తెలియదని అన్నారు. వైఎస్ అన్ని ప్రాంతాలను సమానంగా చూశారని, వైఎస్ వచ్చాక తెలంగాణలో తుపాకుల మోతలు ఆగిపోయాయన్నారు.
తెలంగాణలో రక్తం కాదు.. నీరు మాత్రమే పారాలనేది వైఎస్ ఆలోచన అని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనే మొదలయ్యాయని, షర్మిలను తెలంగాణ ప్రజలు తమ కుటుంబంలో ఒకరిగా చూడాలని కోరారు. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కు అని షర్మిల నమ్ముతోందని, తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం వైఎస్సార్ టీపీతో ముందుకొస్తోందని అన్నారు. సమస్యలు పరిష్కరించుకొని ఇరు తెలుగు రాష్ట్రాలు ఎదగాలని విజయలక్ష్మి ఆకాంక్షించారు.