దివంగత మహానేత వైఎస్ మనమడు.. మనమరాలు తొలిసారి తెర మీద కనిపించారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కనిపించిన వారిద్దరూ.. తాజాగా తల్లి షర్మిల వెంట తీసుకురాగా వేంపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇదో రేర్ సీన్ గా చెప్పాలి. రాజకీయాల్లోనూ.. ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు ఫేమస్ అయినప్పటికీ.. బయటకు పెద్దగా కనిపించని షర్మిల పిల్లలు.. శనివారం జరగనున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల వేళ.. ఇడుపులపాయకు వచ్చారు.
ఈ సందర్భంగా ఇడుపులపాయ ఎస్టేట్ లో తన పేరు మీద ఉన్న కొంత భూమిని పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు విజయమ్మ.. షర్మిల.. ఆమె పిల్లలు. సాధారణంగా ఇలాంటి సీన్ చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇడుపులపాయ ఎస్టేట్ కు విజయమ్మ వెళ్లిపోగా.. షర్మిల మాత్రం పిల్లల్ని (కొడుకు రాజారెడ్డి.. కుమార్తె అంజలిరెడ్డి) తీసుకొని వేంపల్లిలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
ఇడుపులపాయ పొలంలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాల భూమిని కుమారుడు రాజారెడ్డి పేరు మీద.. తమ ఎస్టేట్ లో పని చేసే వెంగముని రెడ్డి పేరు మీద ఉన్న 2.12 ఎకరాల భూమిని కుమార్తె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత.. అమ్మమ్మ.. అమ్మతో కలిసి కెమేరా కంటికి చిక్కటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. వీరి ఫోటోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారాయి. తాజా ఉదంతంతో వైఎస్ కుటుంబంలో నాలుగో తరం తెర మీదకు వచ్చినట్లైంది.