ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ చీఫ్ షర్మిల లేఖ సంధించారు. ఏపీ పరిస్తితిపై ఆమె కీలక వ్యా ఖ్యలతో దీనిని ఢిల్లీకి పంపించారు. విభజన తర్వాత ఏపీ దారుణ పరిస్థితిలో ఉందని.. దీనిని పట్టించు కునే వారులేకుండా పోవడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న షర్మిల.. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం.. కడప ఉక్కు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలను ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే.
వాటిని సాధించడంలో గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరి, నిరుద్యోగం, వెనుక బడిన జిల్లాల విషయాలను కూడా షర్మిల ప్రస్తావిస్తున్నారు. అయితే. ఎంతసేపూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి ఊరుకుంటే బ్యాడ్ సంకేతాలు వెళ్తాయేనని భావించినట్టుగా ఉన్నారు.
ఈ క్రమంలో ఆయా అంశాలను ప్రస్తావిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం గమనార్హం. 2014 నాటి విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదని ఆ లేఖలో షర్మిల పేర్కొన్నారు. విభజన జరిగి పదేళ్లు గడుస్తుననా.. ఇప్పటికీ ఏపీకి రాజధాని లేకుండా పోయిందన్నారు. గత 2014 ఎన్నికల్లో ఏపీకి చేస్తానని చెప్పిన వాగ్దానాలను కూడా బీజేపీ మరిచిపోయిందని వ్యాఖ్యానించారు. విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఏపీ ప్రజలు మోసపోయారని.. ఇప్పటికీ రాష్్టరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని షర్మిల వ్యాఖ్యానించారు.
అయితే.. ఏపీ గురించి ఇప్పుడు షర్మిల లేఖ రాయడం కొత్తే అయినా.. ఇప్పటికి అనేక సార్లు ఇతర పార్టీలు కూడా.. మోడీకి లేఖలు రాశాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి ఉద్యమం పెను రూపం దాల్చినప్పుడు రైతులు, మేదావులు వందల సంఖ్యలో విభజన హామీలు, రాజధాని, అమరావతి వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ.. మోడీకి లేఖలు సంధించారు. అయినా.. ప్రయోజనం మాత్రం కనిపించలేదు.