తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే.ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో ఒక రోజు దీక్షకు పోలీసులు అనుమతినివ్వగా…అక్కడి నుంచి లోటస్ పాండ్ కు పాదయాత్రగా వెళ్లి మరో రెండు రోజుల పాటు దీక్ష చేస్తానని షర్మిల చెప్పారు. ఈ క్రమంలోనే పాదయాత్రను పోలీసులు అడ్డుకునే క్రమంలో షర్మిల స్పృహ తప్పి పడిపోవడం కలకలం రేపింది.
ఈ తోపులాట సందర్భంగా షర్మిల చేతికి గాయమైంది. అయినప్పటికీ లోటస్ పాండ్ లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద షర్మిల రెండొ రోజు దీక్షను కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచీ దీక్ష కొనసాగిస్తున్న షర్మిలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. షర్మిల చేతికి కట్టువేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. రేపు కూడా షర్మిల దీక్ష కొనసాగనుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
తనకు గాయం కావడంతో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండానే దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు. పోలీసులు మరో మారు తనతో దురుసుగా ప్రవర్తిస్తే సహించబోనని షర్మిల చెప్పారు. మరోవైపు, షర్మిల పోరాటం కొనసాగుతుందని వైఎస్ విజయలక్ష్మీ చెప్పారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే పోలీసులు దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. హింసాయుతంగా ప్రవర్తిస్తే ఆందోళనలు ఉధృతమవుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని విజయలక్ష్మీ తెలిపారు.