దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై ఆయన కూతురు, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నీటి ప్రాజెక్టులు, కమీషన్లు తీసుకోవటం తదితర అంశాలపై మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ మాదిరిగా వైఎస్సార్ ఒక్క సంస్ధకే పనులన్నీ అప్పగించి కమీషన్లు ఒక్కరి దగ్గరే తీసుకోలేదన్నారు. అంటే ప్రాజెక్టులను ఒక్క సంస్ధకు మాత్రమే కాకుండా అనేక సంస్ధలకు అప్పగించి అందరి దగ్గరా కమీషన్లు తీసుకున్నారని అర్ధమొచ్చేట్లు చెప్పారు.
కేసీయార్ మాత్రం ప్రాజెక్టుల నిర్మాణాలను కేవలం ఒకే కంపెనీకి అప్పగించి కమీషన్లు మొత్తాన్ని ఆ ఒక్క కంపెనీ నుండే తీసుకుంటున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డే దోచుకుంటున్నట్లు షర్మిల మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టు అంటేనే ప్రభుత్వానికి మేఘా కంపెనీ తప్ప మరోటి గుర్తుకు రావటం లేదని మండిపడ్డారు. కేసీయార్ కు భాగస్వామ్యం లేకపోతే అన్నీ ప్రాజెక్టులు ఆ సంస్ధకే ఎందుకిస్తున్నట్లు అంటు నిలదీశారు.
భద్రాచలంలో ముంపుకు కారణం కేసీయార్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. ముంపు సమస్యలను పరిష్కరించకుండా విదేశీ కుట్రను, క్లౌడ్ బరెస్టని ఏవేవో పిట్టకథలు చెప్పినట్లు ఆమె ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంలో ముంపని ఇపుడు చెబుతున్న కేసీయార్ మరి గతంలో పొరుగు రాష్ట్రముఖ్యమంత్రిని ఇంటికి పిలిపించుకుని కౌగలించుకున్నపుడు, స్వీట్లు తినిపించినపుడు ఆ విషయం గుర్తుకురాలేదా ? పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదంటు మండిపడ్డారు.
మొత్తానికి మీడియా సమావేశంలో షర్మిల టంగ్ స్లిప్పు ఇపుడు సంచలనంగా మారింది. తన తండ్రి వైఎస్సార్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుండి కమీషన్లు తీసుకున్నారని అంగీకరించారు. మీడియా సమావేశంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. దాంతో మీడియా సమావేశమైన తర్వాత తాను ఎంత తప్పుగా మాట్లాడింది షర్మిలకు అర్ధమైంది. వెంటనే వైఎస్సార్ ఎవరి దగ్గరా కమీషన్లు తీసుకోలేదని చెప్పబోయి తప్పు మాట్లాడినట్లు పీఆర్వో వివరణ పంపారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోయింది.