సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆయన ముందస్తు బెయిల్ విచారణ రేపటికి వాయిదా పడింది. ఇక, ఆస్తి కోసమే వివేకాను హత్య చేశారని వివేక అల్లుడిపై సంచలన ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే వివేక ఆస్తుల వ్యవహారం తెరపైకి రావడంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన చిన్నాన్న వివేక తన ఆస్తులన్నింటినీ సునీత పేరు మీద రాయించారని, ఒకటో అరో ఆస్తులు ఆయన పేరు మీద ఉన్నాయని వెల్లడించారు. ఆ అరాకొరా ఆస్తులు కూడా సునీత పిల్లల పేరు మీద వీలునామా రాశారని షర్మిల వెల్లడించారు. వివేకా హత్యకు ఆస్తులు, ఆస్తి తగాదాలు కారణం కాదని, ఒకవేళ ఆస్తి కోసమే వివేకాను హత్య చేసి ఉంటే చిన్నాన్న వివేకాని కాకుండా సునీతను చంపేవారని షర్మిల అన్నారు.
వివేక గొప్ప వ్యక్తి అని, ప్రజాదరణ ఉన్న నాయకుడని షర్మిల కొనియాడారు. ప్రజలందరికీ వివేకా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేశారని, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని చూడకుండా ప్రజల కోసం ప్రయాణించే వారని అన్నారు. అటువంటి వ్యక్తి గురించి కొందరు వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని, మన మధ్య లేని వ్యక్తి గురించి ఈ రకంగా అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇటువంటి అసత్య కథనాలతో ఆయా మీడియా సంస్థలు తమ విలువను పోగొట్టుకోవద్దని హితవుపలికారు.