మహబూబాబాద్ లో వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై విమర్శలు గుప్పించారు. సమాజంలో హిజ్రాలకంటూ ఒక విలువందని, వారికున్న పాటి విలువ కూడా శంకర్ నాయక్ కు లేదని షర్మిల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలతో హిజ్రాల మనోభావాలు దెబ్బతిన్నాయని, అందుకే హిజ్రాలకు షర్మిల బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హిజ్రాలు డిమాండ్ చేశారు.
షర్మిల క్షమాపణలు చెప్పకుంటే ఆమె పాదయాత్రను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై షర్మిల మీడియా ముఖంగా స్పందించారు. హిజ్రాలంటే తనకు గౌరవం ఉందని, వారిని కించపరచడం తన ఉద్దేశం కాదని, శంకర్ నాయక్ మాటలను తిప్పికొట్టే క్రమంలో హిజ్రాల ప్రస్తావన తీసుకువచ్చానని చెప్పారు. హిజ్రాలకు ఉన్నపాటి గౌరవం ఆయనకు లేదని మాత్రమే తాను చెప్పానని గుర్తు చేశారు.
అయినా సరే తన మాటలు వల్ల హిజ్రాల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారందరికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని షర్మిల అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హిజ్రాల సంక్షేమానికి పాటుపడతానని షర్మిల హామీ ఇచ్చారు. హిజ్రాల సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే ఈ విషయంపై గవర్నర్ ను కలిసి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామని షర్మిల చెప్పారు.