తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ తనయ వైఎస్ షర్మిల తీవ్రమైన సంకట స్థితిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు పరిశీలకులు. పార్టీని పుంజుకునేలా చేయడంలో ఆమె వేస్తున్న పాచికలు ఒక్కటి సక్సెస్ కాకపోవడం.. తెలంగాణ ప్రజల మాట అటుంచితే.. అసలు ఇతర పార్టీల్లోని నాయకులు.. కానీ, కొత్తగా చేరే వారు కానీ.. ఎవరూ షర్మిల వైపు మొగ్గు చూపడం లేదు. ఈ క్రమంలో వైఎస్ సతీమణి.. విజయమ్మ ఇటీవల ఆయన 12 వర్ధంతిని పురస్కరించుకుని సంస్మరణ సభను ఏర్పాటు చేశారు.
ఈ సభ ద్వారా షర్మిల తనకు మైలేజీ వస్తుందని భావించారు. కానీ, హైదరాబాద్లో జరిగిన సభ సోసోగా సాగిపోవడం.. ఆశించిన మైలేజీ రాకపోవడం.. ఇప్పుడు.. షర్మిలకు తీవ్ర సంకట స్థితిని తీసుకువచ్చింది. దీనికితోడు.. మంగళవారం నిరుద్యోగ సమస్యపై చేపట్టిన నిరసన కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాదు.. షర్మిల బ్రాండ్ ఇమేజ్ను కూడా ఈ నిరసన పెంచకపోవడం గమనార్హం. అంతేకాదు.. ఇప్పటి వరకు షర్మిల చేపట్టిన ఏ కార్యక్రమం కూడా ప్రజల్లోకి చేరలేదు. దీంతో ఇప్పుడు ఆమె మరో కోణం వైపు దృష్టి పెట్టారని తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా తెలంగాణ కోడలిగా తననుతాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు కూడా విజయం సాధించలేక పోతున్నాయి. దీంతో ఒక్క షర్మిల పేరుతప్ప .. పార్టీ పేరుకానీ, ఊరు కానీ ఎక్కడా వినిపించకపోవడం.. కనిపించకపోవడం గమనార్హం. ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, వారిలోకి పార్టీని బలంగా తీసుకువెళ్లేందుకు షర్మిల.. పాదయాత్ర దిశగా ఆలోచన చేస్తున్నారు. దీనికి దళితుల అంశాన్ని ఆమెను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ క్రమంలో 100 రోజుల పాత్ర చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు అక్టోబరు 18న ఈ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కవర్ చేసేలా ఈ పాదయాత్ర ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే.. చేపట్టే పథకాలు, అమలు చేసే సంక్షేమం వంటివాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా దళితుల ఉద్ధరణ విషయాన్ని ఆమె పాదయాత్ర ద్వారా వినిపించే అవకాశం కనిపిస్తోంది.
ఇక, పాదయాత్ర విషయానికి వస్తే.. ఆమెకు ఇది కొత్తకాదు. గతంలో తన అన్న, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కోసం ఆమె పాదయాత్ర చేశారు. 2012లో వివిధ కేసులకు సంబంధించిజగన్ జైల్లో ఉన్నప్పుడు.. వైసీపీని కాపాడుకునే ప్రయత్నంలో షర్మిల పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆ యాత్ర కూడా అక్టోబరు 18నే ప్రారంభమైంది. అది కూడా చేవెళ్ల నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో షర్మిల తన పాదయాత్ర ద్వారా.. వైఎస్సార్ టీపీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని.. భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.