ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల నేతలు, కార్యకర్తలతో సమావేశమైన షర్మిల…త్వరలోనే పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. జులై 8 పార్టీ ప్రకటన ఉంటుందని…. ఏప్రిల్ 10న పార్టీ పేరు ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, తాజగా ఏప్రిల్ 9న తన పార్టీ పేరును ప్రకటించాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో లక్ష మందితో నిర్వహించనున్న బహిరంగ సభ వేదికగా పార్టీ పేరు ప్రకటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘వైఎస్సార్టీపీ’.. ‘వైఎస్సార్ పీటీ’.. రాజన్నరాజ్యం అనే పేర్లను షర్మిల పరిశీలిస్తున్నారని, మే 14 నుంచి లోటస్ పాండ్ వేదికగా కొత్త పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్నారని టాక్ వస్తోంది.
వాస్తవానికి, జులై 8న పార్టీని ప్రారంభించాలని షర్మిల అనుకున్నారు. కానీ, ఎండల కారణంగా అది ఏప్రిల్ 9కి వాయిదా పడిందని, అదే రోజున ఖమ్మంలో చివరి ఆత్మీయ సమ్మెళనం వేదికగా పార్టీ పేరు ప్రకటించాలని ఆమె అనుకుంటున్నారని తెలుస్తోంది. మే 14న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, మేలో ఎండలధాటికి సభ పెట్టలేమని కార్యకర్తలు చెప్పడంతో… ఆ రోజు నుంచి పార్టీ వ్యవహారాలను లోటస్ పాండ్ నుంచి ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్నారట. అయితే, పార్టీ పేరు, పార్టీ ప్రకటన తేదీపై షర్మిల అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
సోమవారం నాడు లోటస్ పాండ్లో తెలంగాణలోని పలు జిల్లాలనుంచి వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీ ప్రకటన తేదీ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మంగళవారంనాడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 700మంది అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మెళనం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తలు, అభిమానులతో షర్మిల భేటీ కానున్నారు. మరోవైపు, షర్మిలను కొందరు బుల్లితెర ఆర్టిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు.