తెలంగాణలో రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. రాజకీయ కార్యకలాపాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దీనికి తగ్గట్లే రాజకీయ పరిణామాలు వరుస పెట్టి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒకే రోజు తెలంగాణకు చెందిన రెండు పార్టీల అధినేతలు వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది.
ఒకరు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగా మరొకరు టీవైసీపీ అధినేత్రి షర్మిల. వీరిద్దరూ ఒకేరోజు తాము పోటీ చేసే స్థానాలపై అధికారికంగా ప్రకటన చేశారు. తొలి నుంచి అనుకుంటున్నట్లుగా షర్మిల ఖమ్మంలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లుగా షర్మిల స్పష్టం చేశారు. తాను గతంలోనే పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పానని.. తాజా నిర్ణయం అందుకు తగ్గట్లే చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలో 3800కి.మీ. పాదయాత్ర చేసినట్లు చెబుతున్న షర్మిల.. తెలంగాణ ప్రజలు తనను ఆదరిస్తారన్న బలమైన నమ్మకంతో ఉన్నారు.
పాలేరు మట్టి పట్టుకొని.. పాలేరు సాక్షిగా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పానని.. అందుకు తగ్గట్లే తాజా నిర్ణయాన్ని వైఎస్సార్ జయంతి రోజున ఆమె వెల్లడించారు. పాలేరు బిడ్డను అవుతా.. పాలేరు బలాన్ని అవుతానని చెప్పిన షర్మిల.. ఈ నెలలోనే తాను ఆపిన పాదయాత్రను మళ్లీ మొదలుపెడతానని.. మరో 200 కిమీ ప్రయాణించి.. 4వేల కిలోమీటర్ల వద్ద పాలేరులోనే తన మహాపాదయాత్రను ముగిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం పాలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కందాల ఉపేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన అప్పటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) కు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉపేందర్ రెడ్డి ఓడించారు.
ఇక.. బీఎస్పీకి తెలంగాణ పార్టీ అధినేతగా వ్యవహరిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం తాను పోటీ చేసే స్థానాన్ని ప్రకటించారు. కుమురం భీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ సిర్పూర్ లో మాత్రం ఇంకా ఆంధ్రా పాలనే కొనసాగుతుందన్న ఆయన.. తన బంధువులకే ఎమ్మెల్యే కోనప్ప కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారన్నారు. సిర్పూరు పేపర్ మిల్లు యాజమాన్యం స్థానిక కార్మికులకు తక్కువ జీతాలు.. నాన్ లోకల్ం కు ఎక్కువ వేతనాలు ఇస్తూ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లుగా ఆరోపించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప విజయం సాధించారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన పాల్వాయి హరీశ్ బాబును ఓడించారు.