వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పై ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, వైటీపీతో షర్మిలకు సంబంధం లేదని సంచలన ప్రకటన చేశారు. అసలు వైటీపీ షర్మిలది కాదని, పార్టీలో ఆమెకు సభ్యతమే లేదని షాకింగ్ ఆరోపణలు చేశారు. తెలంగాణ సమాజంలో షర్మిలకు చోటు లేదని, ఆమెను బహిష్కరించాలని గట్టు రామచంద్రరావు పిలుపునిచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలని నమ్మితే తడిగుడ్డతో గొంతు కోశారని, ద్రోహి షర్మిలను నమ్మి మోసపోయామని వాపోయారు. నేను నిలబెడతాను మిమ్మల్ని నిలబెడతాను అన్న షర్మిల ఈరోజు నడిరోడ్డుపై తమను నిలబెట్టి వెళ్ళిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని దొంగ అని షర్మిల గతంలో తిట్టారని, ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని, ఆమె మానసిక పరిస్థితిపై అనుమానం కలుగుతుందని విమర్శలు గుప్పించారు.
ఆమె వెంట నడిచినందుకు తెలంగాణ సమాజం తమను క్షమించాలని కోరారు. తెలంగాణకు షర్మిల నాయకత్వం అవసరం లేదని అన్నారు. తెలంగాణలో షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేసిన ఓడిస్తామని చాలెంజ్ చేశారు. త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.