శాసనసభ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సభకు వెళ్లే దమ్ము, ధైర్యం లేకపోతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని తన సోదరుడు వైయస్ జగన్ తో పాటు వైసిపి ఎమ్మెల్యేలను ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఏపీలో 1.17 శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. జగన్ పుట్టక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ఉందని, దాని గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి 1.17 ఓట్ల శాతం ఉన్నా, వైసీపీకి 38 శాతం ఓట్లు ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదని షర్మిల చురకలంటించారు. అసెంబ్లీకి వెళ్లని వైసీపీకి 11 సీట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా రెండు ఒకటేనని షర్మిల ఎద్దేవా చేశారు.
జగన్ ఇలానే చేస్తే వైసీపీకి వచ్చిన 38 శాతం ఓటు బ్యాంకు కూడా ఉండకపోవచ్చు అని షర్మిల జోస్యం చెప్పారు. వైసీపీని ఓడించాలన్న ఉద్దేశంతోనే కూటమికి ప్రజలు ఓటు వేశారని, అయినా గెలిపించిన 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదని అన్నారు. ఇలాగే సభకు వెళ్లకుండా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఆ మాత్రం సీట్లు కూడా వైసీపీకి రావని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.
38 శాతం ఓటు బ్యాంకు ఉందని గొప్పలు చెప్పడం కాదని, దానిని మిగిల్చుకునే లాగా జగన్ తీరు కనిపించడం లేదని షర్మిల అన్నారు. వైయస్సార్ లేని వైసీపీ దే ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ అని, కాంగ్రెస్ ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ కాదని షర్మిల చెప్పారు. ఈ సారి గెలిచినా అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశం తమకు లేదని చెబుతూ మరోసారి ఎన్నికలకు వైసీపీ సభ్యులు వెళ్లే దమ్ముందా అని షర్మిల ప్రశ్నించారు.