వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి గత ఏడాది చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం మరదలు అంటూ షర్మిలనుద్దేశించి అవమానకరరీతిలో నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్లు కాక రేపాయి. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ”మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అని నిరంజన్ రెడ్డి మాట్లాడడం సంచలనం రేపింది.
అయితే, గతంలోనే నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ మంత్రికి భార్యాబిడ్డలు, తల్లీ, చెల్లి లేరా?, ఆ మంత్రికి కల్వకుంట్ల కవిత ఏమైతరో ఆ కుక్కను మీరే అడగండి అని షర్మిల ప్రశ్నించారు. చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం అని, వాటి బుద్ధి ఎక్కడికి పోతుందని, సంస్కారం లేని కుక్కలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నిరంజన్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరంజన్ రెడ్డి సొంత నియోజకవర్గం వనపర్తిలో పాదయాత్ర చేస్తున్న షర్మిల గతంలో తనపై నిరంజన్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ…ఆయనపై ఘాటు విమర్శలు గుప్పించారు.
పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కార హీనుడు నిరంజన్ రెడ్డి అని, అతడికి, కుక్కకు తేడా ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. తన పోరాటంలో ఆయనకు మరదలు కనిపించిందా? అని నిలదీశారు. అసలు ఎవడ్రా నువ్వు?.. నీకు సిగ్గు ఉండాలి అంటూ ధ్వజమెత్తారు. అధికార మదం తలకెక్కి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శర్మ చేసిన ఘాట్ వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.