తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సందర్భానుసారంగా టీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతున్న షర్మిల…సీఎం కేసీఆర్ పైనా పదునైన విమర్శలు చేస్తున్నారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా తన పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తోన్న షర్మిల…కేటీఆర్ పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణలో అసలు సమస్యలేమీ లేవని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని, అది నిజమని నిరూపిస్తే తన ముక్కు నేలకు రాస్తానని కూడా షర్మిల ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలోనే షర్మిలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అన్న మీద కోపం ఉంటే అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకోవాలని, తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టుకున్నారని షర్మిలను కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధమని, ఆమె తండ్రి వైఎస్సార్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల దీటుగా కౌంటర్ ఇచ్చారు. తాము తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం కేటీఆర్ అయ్య కేసీఆర్ అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆత్మహత్యలు చూడలేక, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడలేక, రీడిజైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడం చూడలేకే తెలంగాణలో పార్టీ పెట్టానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, కేసీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా? అని షర్మిల ప్రశ్నించారు.
ఇన్నాళ్లు బీజేపీతో డ్యూయెట్లు పాడింది మీరేనని షర్మిల కేసీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని… సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పారు. తమకు వైఎస్సార్ బొమ్మ ఉందని, వైఎస్సార్ అనే పేరు ఉందని చెప్పారు. వైఎస్సార్ సంక్షేమ పాలనే తమ ఆస్తి అని, పేదవాడికి వైఎస్సార్ సంక్షేమ పాలనను అందిస్తామని చెప్పారు. ముమ్మాటికీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లను చీలుస్తామని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.