రూ.1,100 కోట్ల భారీ వ్యయంతో తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ నిర్మించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వాస్తు కోసమే పాత సచివాలయాన్ని వదిలేసి కొత్త సచివాలయం అంటూ ప్రజా ధనం వృథా చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయినా సరే, కేసీఆర్ మాత్రం వెనక్కు తగ్గకుండా కొత్త సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
మరి కొద్ది రోజుల్లో కేసీఆర్ పుట్టిన రోజునాడు దానిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హఠాత్తుగా ఈ రోజు తెల్లవారుఝామున నూతన సచివాలయంలో దట్టమైన పొగలు వెలువడడం సంచలనం రేపింది. ఆ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, నూతన సచివాలయంలో మాక్ డ్రిల్ చేపట్టామని, అందుకే ఆ పొగలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కానీ, అధికారులు చెబుతున్న వెర్షన్ ను ప్రతిపక్ష నేతలు నమ్మడం లేదు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు.
కొత్త సచివాలయంలో సరైన భద్రతా ప్రమాణాలు లేవని ఈ ఘటనతో బట్టబయలైందని, దొరగారు ఏది కట్టినా పైన పటారం లోన లొటారం అని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రమాదం ఎందుకు జరిగిందని విచారణ జరపాలని, మాక్ డ్రిల్ చేశామని అబద్ధాలు చెబితే నమ్మేవారెవరూ లేరని ఆమె. ప్రారంభానికి సిద్ధమవుతున్న సచివాలయంలో అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, నూతన సచివాలయం పరిశీలించేందుకు అఖిలపక్ష నేతలకు అనుమతినివ్వాలని కోరారు.
మరోవైపు, ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. సచివాలయ సందర్శనకు తనకు అనుమతి నిరాకరించారని విమర్శించారు. సచివాలయం వద్దని తనతోపాటు దేవుడు కూడా అనుకున్నాడని, అందుకే సచివాలయం కాలిపోయిందని తనదైన శైలిలో పాల్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇక, తనతోపాటు దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడని పాల్ సెటైర్లు వేశారు.
సీఎంగా కూడా ఈ సారి గెలిచే అవకాశం లేని కేసీఆర్ ప్రధాని అవుతారా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పుట్టినరోజున కాకుండా అంబేద్కర్ పుట్టినరోజున కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, తనను తెలంగాణ నుంచి బహిష్కరిద్దామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.