బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేస్తూ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులను కేసీఆర్ కీలుబొమ్మలుగా వాడుకుంటున్నారని, పరిస్థితి దిగజారుతోందని అన్నారు. తన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు అణచివేస్తున్నారని, అందుకే, తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులపైనే ప్రైవేటు కేసు పెట్టబోతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను పోలీసులు తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలేశారని షర్మిల ఆరోపించారు. తనను హౌస్ అరెస్ట్ చేశారని, దిగ్భంధం చేశారని చెప్పారు. కనీసం న్యాయ వ్యవస్థ బతికున్నందుకు సంతోషంగా ఉందన్నారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన తనను కోర్టుకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అంతేకాదు, తన ఇంటి దగ్గరకు మీడియాను కూడా అనుమతించడం లేదని, తమ పార్టీ కార్యకర్తలను కార్యాలయానికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ పేరు నుంచి తెలంగాణను తొలగించి, బంది పోట్ల రాష్ట్ర సమితిగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణను దోచుకోవడం అయిపోయిందని, కేసీఆర్ దేశంపై పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతుల ద్రోహి కేసీఆర్… ఇప్పుడు కిసాన్ కా సర్కార్ అని నాటకాలాడుతున్నారంటూ మండిపడ్డారు. తన పాదయాత్రకు హైకోర్టు మరోసారి అనుమతిచ్చిందని, కోర్టు ఆదేశాలను గౌరవించి కేసీఆర్ తన పాదయాత్రకు అడ్డంకులు కలిగించకూడదని అన్నారు. నిరాహారదీక్ష వల్ల తన ఆరోగ్యం దెబ్బతిన్నదని, సంక్రాంతి తర్వాత ఆపిన చోటి నుంచే యాత్రను ప్రారంభిస్తామని చెప్పారు.