సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టే షర్మిలను బాపట్ల నుంచి అవతలికి అడుగుపెట్టనిచ్చామంటూ వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల ధీటుగా స్పందించారు. నగరిలో రోడ్ షో నిర్వహించిన షర్మిల రోజాతో పాటు కోన రఘుపతిపై విమర్శలు గుప్పించారు. నోరుంది కదా అని పారేసుకోవద్దంటూ రోజాకు షర్మిల వార్నింగ్ ఇచ్చారు.
అలా తెలంగాణలో తనపై నోరు పారేసుకున్న వాళ్లంతా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారని, రేపు మీ పరిస్థితి కూడా అంతే అంటూ రోజానుద్దేశ్యించి జోస్యం చెప్పారు. ఇక, కాసేపు తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కాదని అనుకుందామని, ఎంతమంది వస్తారు రండి చూసుకుందాం…ఏం చేస్తారో చేయండి.. మీ దమ్మేంటో చూపించండి అంటూ షర్మిల సవాల్ విసిరారు. రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టుకొని ఆయన ఆశయాల కోసం నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, దరిద్రంగా ఆడ మగ తేడా లేకుండా నీచంగా వ్యవహరించడానికి సిగ్గుండాలని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు పోలికే లేదని దుయ్యబట్టారు. ఏపీలో తప్పులను ఎత్తిచూపుతున్నందుకే చెల్లెలు అనే ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో వైసీపీ కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తన సేవలు అందించానని, ఫలానా పదవి కావాలని తను ఎప్పుడు జగనన్నను అడగలేదని అన్నారు. వైసీపీ మొక్కగా ఉన్నప్పుడు నీళ్లు పోసి, ఎరువు వేసి కాపాడనని ఇప్పుడు అది ఒక చెట్టు అయిన తర్వాత తన అవసరమే లేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల మాటలలో అహంకారం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తాను ప్రజల కోసమే వచ్చానని చెప్పారు.