ఏలూరు జిల్లాలో ఓ పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే రేప్ జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై మహిళా చైర్ పర్సన్ మాత్రమే స్పందించారు. మంత్రి రోజాతోపాటు మిగతా వైసీపీ మహిళల నేతలు ఎవరు పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం నేపథ్యంలో జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న జగన్ కు ఏపీలో ఆడపిల్లల, మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవని షర్మిల సంచలన విమర్శలు చేశారు. “నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు, నా అవ్వలు అంటూ జబ్బలు చరిచి మైకుల ముందు గొంతు చించుకుని మొసలి కన్నీరు, ఫేక్ ప్రేమలు నటించే ముఖ్యమంత్రి గారూ… మన రాష్ట్రంలో, మీ పాలనలో మహిళల భద్రతకు, మహిళల బ్రతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకుంటోంది. రాష్ట్రానికి ఈ అత్యున్నత ర్యాంకులు ఎందులో రావాలో అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో… సిగ్గులేకుండా మిన్నకుండిపోతారో ప్రజలు గమనిస్తున్నారు” అని జగన్, వైసీపీ మహిళా నేతలపై షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.