ప్రతి కుటుంబంలో ఆస్తి గొడవలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయని ఏపీ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలకు షర్మిల దీటుగా బదులిచ్చారు. ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండటం సామాన్యం అంటూనే తనను తన తల్లి విజయమ్మను జగన్ కోర్టుకు ఈడ్చారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాన్యం కాదు జగన్ సార్ అంటూ షర్మిల చురకలంటించారు.
ఈ ఆస్తి వివాదం తమ కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకోవాలనుకున్నామని, కానీ జగనన్న కోర్టుకు వెళ్లడంతో ఇది పబ్లిక్ అయిందని షర్మిల చెప్పుకొచ్చారు. ఈ ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది కాబట్టి తన బెయిల్ రద్దు అవుతుందని జగన్ చెబుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. అయితే, సరస్వతి కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేయలేదని షర్మిల అన్నారు. కాబట్టి ఆ షేర్లను ఎప్పుడైనా బదిలీ చేసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు.
2016లో ఆ ఆస్తులు అటాచ్ చేశారు కాబట్టి షేర్ల బదిలీ జరగకూడదని జగన్ అంటున్నారని, కానీ, 2019లో 100% వాటాలు బదిలీ చేస్తానని ఎంవోయూపై జగనన్న ఎందుకు సంతకం పెట్టారని షర్మిల సూటిగా ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలపై జగన్ స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తి రేపుతోంది.