ఏపీలో నియంతల మాదిరి పాలన సాగిస్తున్న వారిని తక్షణమే తరిమి కొట్టాలని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఆచితూచి ఓటేయాలని షర్మిల పిలుపునిచ్చారు. మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి జగనన్న కనీసం మద్య నిషేధం చేయకపోగా.. మరింతగా మద్యంపైనే ఆధారపడుతున్నారని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో పర్యటించిన షర్మిల.. రచ్చబం డ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీతో అంటకాగుతున్న వైసీపీ ఏపీకి రావాల్సిన న్యాయ బద్ధమైన విషయాల్లోనూ స్పందించడం లేదన్నా రు. “151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఏం చేశారు? కనీసం పోలవరం పూర్తి చేయలేకపోయారు. వైఎస్సార్ ఆశయాలను అమలు చేయలేకపోయారు. మీకు వైఎస్ ఆర్ ఫొటో పెట్టు కునే అర్హత ఉందా?“ అని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో దగ్గరకు వస్తున్న కొద్దీ.. అనేక హామీలతో ప్రజలను మోసం చేసేందుకు పార్టీలు తయారవుతున్నాయని దుయ్యబట్టారు.
అదేవిధంగా ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలను మభ్య పెట్టేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని షర్మిల వ్యాఖ్యానించారు. “కోట్లరూపాయలు రెడీ చేసుకుని అభ్యర్థులు మీ ముందుకు వస్తారు. ఓటుకు 5 వేలు పది వేలు బేరం పెడతారు. ఆ డబ్బులు మీవే. మిమ్మల్ని మోసం చేసి.. గనులు తవ్వి, ఇసుక తవ్వి.. గ్రానైట్ దోచుకుని సంపాయించుకున్న సొమ్మే.. మీరు తీసుకోండి. కానీ , ఓటు వేసే టప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి. మీకు ప్రత్యేక హోదా ఇచ్చే కాంగ్రెస్ను ఆదరించండి“ అని వ్యాఖ్యానించారు.
నర్శీపట్నం పర్యటనలో ఉన్న షర్మిల రచ్చబండ కార్యక్రమం ముగిసిన అనంతరం పట్టణంలోని డాక్టర్ రాజశేఖర్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబంతో ముచ్చటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎప్పుడు నర్శీపట్నం వచ్చినా తమ ఇంటికి వచ్చేవారని.. ఇప్పటివరకు 5 సార్లు తమ ఇంటికి వచ్చారని డాక్టర్ రాజశేఖర్ వ్యాఖ్యానించారు. తమ ఆసుపత్రికి వైఎస్సార్ పేరు పెట్టుకున్నామని తెలిపారు.