తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన ధ్యేయమని చెబుతోన్న షర్మిల…టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద షర్మిల దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్న డిమాండ్ తో షర్మిల 72 గంటల నిరాహార దీక్ష నిర్వహిస్తానని ప్రకటించారు.
అయితే, పోలీసులు కేవలం ఒకరోజు దీక్షకే అనుమతినిచ్చారు. అయితే, తాను 72 గంటల పాటు దీక్ష కొనసాగిస్తానని షర్మిల తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చందమామ లాంటి పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ ఇంట్లో గడి వేసుకుని నిద్రపోతున్నారా? అని షర్మిల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ రాలేదన్న దిగులుతో ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నా దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదని దుయ్యబట్టారు. చందమామ లాంటి మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ అన్నారని…మరి ప్రత్యేక తెలంగాణా వచ్చినా అదే పరిస్థితికి కారణమెవరని షర్మిల నిలదీశారు.
యువకుల ఆత్మహత్యలకు చలించని కేసీఆర్ ది గుండె? లేక బండరాయా? ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అని షర్మిల మండిపడ్డారు. యువకుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందుకు బాధ్యులెవరని షర్మిల ప్రశ్నించారు. వారి కుటుంబాలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని, తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఏ పార్టీ వచ్చినా రాకున్నా…యువతకు మద్దతుగా తాము నిలబడతామని షర్మిల చెప్పారు. తాను 72 గంటలు నిరాహార దీక్ష చేస్తానని, నాలుగో రోజు నుంచి జిల్లాల్లోనే తమ నాయకులు దీక్షలు చేస్తుంటారని స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, ప్రభుత్వం నిద్రలేవాలని షర్మిల వ్యాఖ్యానించారు.