తెలంగాణ సీఎం కేసీఆర్…తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను అనధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలోని పలువురు నేతలు కేటీఆరే కాబోయే సీఎం అని కూడా ప్రచారం మొదలెట్టేశారు. కేసీఆర్ తర్వాత పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేటీఆర్…రాబోయే ఎన్నికల్లో చక్రం తిప్పబోతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ పై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్, కేటీఆర్ ల ఇలాఖాల్లో రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటని, ఇటువంటి సందర్భంలో ఎమ్మెల్యేని, మంత్రిని, కాబోయే సీఎంనని కేటీఆర్ చెప్పుకోవడానికి సిగ్గుండాలని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ ల సత్తాలేని పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇంగితం ఉంటే తండ్రీ కొడుకులిద్దరూ రైతులను ఆదుకోవాలని షాకింగ్ కామెంట్లు చేశారు.
రైతుబంధు డబ్బులు ఇచ్చి… విత్తనాలు, సబ్సిడీలు, యంత్రలక్ష్మి, నష్టపరిహారాలను ఆపేశారని మండిపడ్డారు. మరణించిన రైతు కుటుంబాలకు కూడా పెన్షన్ ఇవ్వడం చేతకాని ప్రభుత్వం ఇదని ఎద్దేవా చేశారు. రైతుల పాలిట యముడిలా మారిన కేసీఆర్ రైతు ద్రోహి అని, సీఎం పదవికి కేసీఆర్ అనర్హుడని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పాలన చేతగాకే కేసీఆర్ గల్లీల్లో దర్నాలు, ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని, చావు డప్పు కొట్టాల్సింది కేసీఆర్ ప్రభుత్వానికేనని విమర్శించారు. ‘వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు’ అనే నినాదంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.తయారయ్యారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో పంట కొనుగోళ్లలో జాప్యం,అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.