సీఎం జగన్ సోదరి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో తన అన్నకు చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి ఇక్కడ రాజకీయాలు చేయడంపై తెలంగాణ నేతలు పలువురు విమర్శలు గుప్పించారు. జగన్ తో షర్మిలకు విభేదాలు వచ్చాయని, అందుకే ఆమె తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకుందని కేటీఆర్ సహా పలువురు ఎన్నోసార్లు విమర్శించారు.
అంతేకాదు, గతంలో తన తండ్రి జయంతి, వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు కలిసి వచ్చి నివాళులర్పించే జగన్, షర్మిళలు కొంతకాలంగా విడివిడిగా రావడం కూడా ఆ పుకార్లకు ఊతమిచ్చింది. ఇక, మొన్నటికి మొన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ వెళ్లి మరీ సిబిఐకి షర్మిల వాంగ్మూలం ఇవ్వడం సంచలనం రేపింది. దీంతో జగన్ తో షర్మిలకు అస్సలు పడడం లేదని, వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ విమర్శలపై వైయస్ షర్మిల స్పందించారు. తన సోదరుడు జగన్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని షర్మిల క్లారిటీనిచ్చారు. జగన్ తో తనకు గొడవలున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని షర్మిల చెప్పారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా జగన్ తో గొడవలుంటే ఏపీలో పార్టీ పెట్టుకోవాలని కేటీఆర్ సూచించారని షర్మిల గుర్తు చేశారు.
తన సోదరుడితో తనకు గొడవలు ఏమీ లేవని, అందుకే తాను ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నానని చెప్పారు. అత్త మీద కోపం దుత్త మీద చూపడం లేదని, అలా అయితే తాను ఏపీలోనే పార్టీ పెట్టుకుని తన అన్నపై కోపం చూపించి ఉండాల్సిందని షర్మిల పరోక్షంగా వ్యాఖ్యానించారు.