తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ విసిరిన బాణం షర్మిల అంటూ కొందరు అంటుంటే….జగన్, కేసీఆర్ లు కలిసి వదిలిన బాణం షర్మిల అని మరికొందరు విపక్ష నేతలు అంటున్నారు. ఇటువంటి విమర్శల నేపథ్యంలో తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉద్యోగ దీక్ష అంటూ నిరుద్యోగులకు అండగా నిలుస్తానని చెప్పిన షర్మిల…ప్రతి మంగళవారం దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, సైదాబాద్ లో రేప్ కు గురైన చిన్నారికి న్యాయం చేయాలంటూ షర్మిల దీక్ష చేశారు. ఇలా అడపాదడపా దీక్షలు చేస్తున్నప్పటికీ…షర్మిలకు పెద్దగా మైలేజ్ రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా షర్మిల తెలంగాణవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవు తున్నారు.
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న తన పాదయాత్ర షెడ్యూల్ ను షర్మిల ప్రకటించారు. తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అడుగులో అడుగు వేస్తున్న షర్మిల…తన తండ్రి సెంటిమెంట్ ను నమ్ముకొని చేవేళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. నాన్నకు కలిసివచ్చిన చేవెళ్ల నుంచే తొలి అడుగు వేసి…ఆనాడు తన తండ్రి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చినట్లుగానే…తన పార్టీని అధికారంలోకి తేవాలని షర్మిల భావిస్తున్నారట.
వైఎస్ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన చేవెళ్ల నుంచి మొదలుకానున్న షర్మిల పాద యాత్ర ఏడాది పాటు కొనసాగుతుంది. అక్టోబర్ చేవేళ్లలో మొదలు కానున్న యాత్ర…తిరిగి అదే ఊరిలో ముగియనుంది. మొత్తం 90 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో ఎటువంటి బ్రేక్లు ఉండవని షర్మిల ప్రకటించారు. ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టబోతున్నారు. గతంలో చాలామందికి అధికారం కట్టబెట్టిన పాదయాత్ర…ఈసారి ఎటువంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి.