విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. అన్నగారి చొరవతో 36 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఆ విశ్వవిద్యాలయం పేరును జగన్ మార్చడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆ పేరు మార్పునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఇక, జగన్ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు.
జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సానుభూతిపరుడిగా పేరున్న తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ కూడా తన పదవికి రాజీనామా చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే జగన్ నిర్ణయాన్ని ఆయన సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా తప్పుబట్టడం సంచలనం రేపుతోంది. ఇలా పేర్లు మార్చడం సరికాదని తన సోదరుడికి షర్మిల హితవు పలికారు.పేర్లు మారిస్తే దానికున్న విలువ పోతుందని షర్మిల అభిప్రాయపడ్డారు.
అప్పటి పరిస్థితులు, కారణాల వల్ల ఒక ప్రాంతానికో, ఒక యూనివర్సిటీకో ఒక పేరు పెడతారని, ఆ పేరును అలాగే కొనసాగిస్తే తరతరాల వారంతా వారికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుందని అన్నారు. అదే పేరు కొనసాగించడం వల్ల జనాల్లో కన్ఫ్యూజన్ పోగొట్టినట్టు ఉంటుందని తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే, ఎవరు ఏం చేస్తున్నారో జనాలకు అర్థంకాదని అన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయనను కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని షర్మిల మండిపడ్డారు.
వారంతా ఎన్నికల సమయంలో తన తండ్రి పేరు వాడుకుంటారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారని విమర్శించారు. వైఎస్సార్ కు తానే అసలైన రాజకీయ వారసురాలినని… కాంగ్రెస్ పార్టీ కాదని షర్మిల అన్నారు.