త్వరలోనే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మరికొద్ది నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో షర్మిల…అధికార పార్టీపై విమర్వలు తీవ్రతరం చేశారు. కేసీఆర్ పై తాజాగా ఆమె మరోసారి సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు పిట్టలదొర చేసే వింతలు అన్నీ ఇన్నీ కావని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. పాలమూరు ఓట్ల కోసం దొర తొందరపడుతున్నాడని, సగం పనులు జరగని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారని ఎద్దేవా చేశారు. పూర్తికాని రిజర్వాయర్లకు పూజలు..కాలువలు తవ్వకుండానే ఊరూరా ఉత్సవాలు జరపబోతున్నారని చురకలంటించారు.
ప్రత్యేక తెలంగాణలోని తొలి ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డిని కేసీఆర్ సర్వనాశనం చేశాడని ఫైర్ అయ్యారు. కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కుమ్మరించి పాలమూరుకు శఠగోపం పెట్టాడని దుయ్యబట్టారు. దీంతో, ఆ ప్రాజెక్టు మూలనపడిందని, ఎన్నికల ముందు నామమాత్రపు పనులు చేసి ప్రాజెక్టు పూర్తయిందని ప్రజలను మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆ ప్రాజెక్టు పనులు 50 శాతం కూడా పూర్తా కాలేదని, అంజనాపూర్ మొదటి రిజర్వాయర్ లో 90 శాతం పనులు పూర్తి చేసి ప్రాజెక్టు మొత్తం కట్టినట్టు నమ్మించబోతున్నారని అన్నారు.
భూ నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా సాయం అందలేదని, కాలువలకు భూసేకరణ పూర్తి కాలేదని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చిత్తశుద్ధి ఇదీ అంటూ మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా పాలమూరు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ సర్కారుకు పాడె యాత్ర చేయాలని, బీఆర్ఎస్ బందిపోట్లకు బడితె పూజలు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును, కేసీఆర్ కమీషన్ల కోసం రూ.55 వేల కోట్లకు పెంచాడని, అయినా పూర్తి చేయలేకపోయాడని విమర్శించారు. దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవన్న సర్వేలతో దొరకు భయం పట్టుకుందని, ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న జ్ఞానం లేదని ఎద్దేవా చేశారు.