ఏపీలో అధికారంలోకి రావడమో… లేక కనీసం గౌరవ ప్రదమైన ప్రతిపక్షం స్థానానికి రావడమో లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ క్రమంలో ఏపీకి మాత్రమే పరిమితం చేస్తూ.. 9 గ్యారెంటీలు ప్రకటించింది. ఆయా గ్యారెంటీలను తాము ఏపీలో అధికారంలోకి రాగానే అమలు చేస్తామని.. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా ప్రకటించారు. వీటిని తూ.చ. తప్పకుండా అమలు చేసే బాధ్యతను తీసుకుంటామ న్నారు. విజయవాడలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన షర్మిల.. ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు. అయితే, తన అన్నయ్య జగన్ నవరత్నాల మాదిరిగానే 9 హామీలను షర్మిల ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. నవ (9) రత్నాల తరహాలోనే నవ హామీలతో జగనన్నను ఫాలో అయిన షర్మిల అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ.. 9 గ్యారెంటీలు..
1) రాష్టానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా: కాంగ్రెస్ అధికారంలో వస్తె రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా గ్యారెంటీ. అధికారంలో వచ్చిన వెంటనే హోదా అమలు.
2) మహిళా మహాలక్ష్మి: ప్రతి పేద మహిళలకు ప్రతి నెల 8500 ఇస్తాం. ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తాం.
ఇది మహిళకు బరోసా ఇచ్చే పథకం.
3) రైతులకు రుణమాఫీ: రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ.
4) మద్దతు ధర: పెట్టుబడి మీద రైతులకు 50 శాతం లాభంతో కూడిన కొత్త మద్దతు ధర
5) కనీస వేతనం రూ.400: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రోజుకు రూ.400
6) ఉచిత విద్య: అర్హులైన పేద కుటుంబాల్లోని పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
7) ఉద్యోగాల భర్తీ: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25లక్షల ఉద్యోగాల భర్తీ. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల భర్తీ మీదే
8) పక్కాఇళ్ల నిర్మాణం: ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్లు.
9) సామాజిక పింఛన్: ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్. అర్హులైన ప్రతి ఒక్కరికీ 4 వేల పెన్షన్. వికలాంగులకు 6 వేల పెన్షన్