వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయంగా ఎటూకాకుండా ఇరుక్కుపోయారా ? షర్మిల ముందుకు వెళ్ళటానికి ఆప్షన్ లేదా ? గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేదో ఊహించేసుకుని షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టారు. ఆమె పార్టీ పెట్టినప్పుడు పరిస్ధితి ఎలాగుందో ఇఫ్పుడూ అలాగే ఉంది. పార్టీ మొత్తంమీద షర్మిల తప్ప చెప్పుకోవటానికి రెండో నేతే లేరు. అందుకనే ఎందుకొచ్చిన తలనొప్పులని చెప్పి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేయమని హస్తంపార్టీ సీనియర్ నేతలు పదేపదే ఒత్తిడి తెస్తున్నారు.
మొదట్లో విలీనం కుదరదని మహాయితే పొత్తుపెట్టుకునే విషయాన్ని ఆలోచిస్తామని షర్మిల చెప్పారు. అంటే షర్మిల ఆలోచన ఏమిటంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నామినేషన్లు వేస్తే ఇలా గెలిచిపోవటం అలా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేయటమే అన్నట్లుగా ఉండేది. అయితే తాను భ్రమల్లో ఉన్నానని, తనపార్టీకి అంత సీన్ లేదని షర్మిల తెలుసుకునేందుకు ఎంతో కాలం పట్టలేదు. జనాల్లోకి పార్టీని తీసుకెళ్ళేందుకు షర్మిల ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు.
పార్టీ ఉనికిని చాటుకునేందుకు ఎంత ప్రయత్నాలుచేస్తున్నా ఎవరు పట్టించుకోవటంలేదు. మామూలు జనాలు కాదు చివరకు సహచర రాజకీయపార్టీలు కూడా వైఎస్సార్టీపీని గుర్తించటంలేదు. కాలం గడిచేకొద్దీ షర్మిలకు వాస్తవం ఏమిటో అర్ధమైనట్లుంది. దాంతో పార్టీ భవిష్యత్తు ఏమిటో షర్మిలకు అర్ధంకావటంలేదు. సరిగ్గా ఈ సమయంలోనే కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ ఘనవిజయం షర్మిలలో కాస్త ఊరటనిచ్చినట్లుంది. ఎందుకంటే కర్నాటక డిప్యుటి సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకోవటమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు డీకే బాగా సన్నిహితులు.
అందుకనే డీకే కూడా చొరవచూపించి షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనంచేసేట్లుగా మాట్లాడుతున్నారు. ముందు పొత్తని షర్మిల బెట్టుచేసినప్పటికీ కాంగ్రెస్ అంగీకరించలేదు. దాంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేయాలని డీకే కూడా ఒత్తిడి తెస్తున్నారట. షర్మిలకు కూడా ఇంతకన్నా ఆప్షన్ కనబడటంలేదని సమాచారం. హాయిగా కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనం చేసేసి రాబోయే ఎన్నికల్లో తాను పాలేరులో పోటీచేస్తే గెలుపు గ్యారెంటీ ఉంటుందేమో ఆలోచించాలి. లేకపోతే తన గెలుపు కూడా అనుమానమే.