అసెంబ్లీ సమావేశాలకు అలా వచ్చి అటెండెన్స్ వేసి ఇలా వెళ్లిపోయిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ పై టీడీపీ, జనసేన నేతలు ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విమర్శకుల జాబితాలోకి జగన్ సోదరి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చేరారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది అని తన అన్న జగన్ ను షర్మిల ఏకిపారేశారు.
ప్రజా సమస్యల కన్నా ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అంటూ జగన్ ను నిలదీశారు. తమ శాసన సభ్యత్వాలు రద్దవుతాయన్న భయంతో అటెండెన్స్ వేసేందుకు సభకు వచ్చారా అని ప్రశ్నించారు. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మారలేదని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా కావాలా? అని వైసీపీ తీరును ఎండగట్టారు. ప్రజా శ్రేయస్సుకంటే.. వైసీపీకి పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా మరోసారి నిరూపించుకున్నారని విమర్శించారు.
వైసీపీ సభ్యులకు పదవులు ముఖ్యం కాదనుకుంటే.. ప్రజాసమస్యల మీద వారికి నిజంగా చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా సభకు వెళ్ళే దమ్ము వైసీపీ సభ్యులకు లేకపోతే తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.