వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. మంగళవారం మరదలు అంటూ షర్మిలనుద్దేశించి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ టీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల దీటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం అని, వాటి బుద్ధి ఎక్కడికి పోతుందని, సంస్కారం లేని కుక్కలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ మంత్రికి భార్యాబిడ్డలు, తల్లీ, చెల్లి లేరా? అని షర్మిల ప్రశ్నించారు. ఆ మంత్రికి కల్వకుంట్ల కవిత ఏమైతరో ఆ కుక్కను మీరే అడగండి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.
నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తే హేళన చేస్తారా? అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ కుక్కలను తరిమి తరిమి కొట్టే రోజు చాలా త్వరలోనే వస్తుందని షర్మిల మండిపడ్డారు. మరోవైపు, షర్మిలకు మంత్రి నిరంజన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ వైఎస్సార్ టీపీ నేత హిందూజ, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి నివసించే మంత్రుల క్వార్టర్స్ వద్ద వైఎస్సార్ టీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. అయితే, వారిని పోలీసులు అరెస్టు చేసి బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు.
దీంతో, అక్కడి సీఐకి ఫోన్ చేసిన షర్మిల తమ నేతలు, కార్యకర్తల అరెస్టులను ఖండించారు. హిందూజను స్టేషన్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించిన షర్మిల…వారిపై ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. వాళ్లు రాళ్లు, కట్టెలు, బాంబులు తేలేదని, మహిళలపై నీచంగా మాట్లాడిన మంత్రిపై ఏం చర్యలు తీసుకోకుండా తమ వాళ్లను స్టేషన్లో పెట్టడం ఏమిటని షర్మిల ప్రశ్నించారు.