వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల అరెస్టు వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించారంటూ షర్మిల కూర్చుని ఉండగానే ఆమె కారును టోయింగ్ చేయడం జాతీయ మీడియాలో సైతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక తన పాదయాత్రను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు.
మరో వైపు తన పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఎన్ని అవాంతరాలు సృష్టించినా పాదయాత్రను కొనసాగిస్తానని షర్మిల తేల్చి చెప్పారు. ఈ నేపద్యంలోనే తాజాగా తన పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరుతూ హైదరాబాద్లో అడిషనల్ డీజీపీని షర్మిల కలిశారు. డిసెంబర్ 4న తన పాదయాత్రను పున:ప్రారంభించబోతున్నట్టుగా షర్మిల ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది పోలీసులేనన్న మచ్చ డిపార్ట్మెంట్ కి వస్తోందని డీజీపీకి వివరించానని షర్మిల అన్నారు.
తమకు సరైన భద్రత కల్పించాలని, పోలీసులకు ఇది తగదని షర్మిల చెప్పారు. టిఆర్ఎస్ గుండాల కోసం పోలీసులు పాదయాత్రను అడ్డుకున్న చోటు నుంచి పాదయాత్రను మళ్ళీ మొదలు పెడతామని షర్మిల ప్రకటించారు. డిసెంబర్ 14 తో పాదయాత్ర ముగుస్తుందని, మొత్తం 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. ఒకప్పటి ఉద్యమకారుల పార్టీ ఆయన టిఆర్ఎస్ ఇప్పుడు తాలిబన్ల పార్టీ మాదిరిగా గూండాలతో నిండిపోయిందని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్లిని నలిపినట్లు నలిపేస్తాం, ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టనివ్వబోం… మీకు ఏం జరిగినా మా బాధ్యత కాదు అంటూ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే ఇది తాలిబన్ల రాజ్యం అనిపిస్తుందని షర్మిల ఎద్దేవా చేశారు.