తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నపటికీ కేసులు పెరగడంపై హైకోర్టు సైతం అసహనం వ్యక్తం చేసింది. కరోనా టెస్టులు పెంచాలంటూ ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ఈటల రాజేందర్ పై భూకబ్జా వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కరోనా వేళ ప్రతీకార రాజకీయాలను పక్కనబెట్టాలని నెటిజన్లు హితవు పలికారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోవాలని కేసీఆర్ ను కోరారు
ఈ నేపథ్యంలో నెటిజన్లు వేసిన ప్రశ్నను కేసీఆర్ ను ఉద్దేశించి వైఎస్ షర్మిల అడిగారు. కేసీఆర్ దొరగారు.. ప్రతీకార రాజకీయాల నుంచి కాస్త తీరిక చేసుకోవాలని షర్మిల సెటైర్ వేశారు. ప్రజలను కరోనా నుంచి కాపాడాలని షర్మిల కోరారు. కరోనా కిట్లు అందట్లేదని లక్షల మంది కాల్ సెంటర్లకు కాల్ చేస్తున్నారని, వారికి కిట్లు ఇవ్వాలని అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి మందులను, ట్రీట్మెంట్లను ఉచితంగా అందించాలన్నారు.
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోన్న షర్మిల…కేసీఆర్ పై సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉద్యోగ దీక్ష పేరుతో షర్మిల దీక్ష చేపట్టడం తెలిసిందే. కేసీఆర్ సర్కార్ పై షర్మిల విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ….టీఆర్ ఎస్ నేతలెవరూ షర్మిలపై విమర్శలు చేయొద్దంటూ కేసీఆర్ చెప్పారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే షర్మిలపై టీఆర్ఎస్ నేతలెవరు విమర్శలు చేయడం లేదు. దీంతో, షర్మిల …కేసీఆర్, జగన్ వదిలిన బాణం అన్న వదంతులు నిజమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు.