ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, షర్మిల దాఖలు చేసిన అఫిడవిట్ లో జగనన్నకు రూ.82 కోట్లు, వదిన భారతీ రెడ్డికి రూ.19 లక్షలు అప్పు పడ్డానని షర్మిల వెల్లడించడం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. జగనన్న నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం షర్మిలకు ఏముంది అంటూ చర్చ..రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై షర్మిల స్పందించారు.
“నేను అఫిడవిట్ లో పేర్కొన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి గారు నాకు అప్పు ఇచ్చారు అనే విషయం మీడియాలో వస్తోంది. సమాజంలో ఏ అన్న అయినా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చేయాలి. అది ఆ ఆడబిడ్డ హక్కు. ఆస్తిని ఇచ్చేయాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. మేనమామగా కూడా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తల్లి తర్వాత తల్లిలా మేనమామ ఉండాలి. సహజంగా ఇది అందరూ పాటించే నియమమే. కానీ కొందరు మాత్రం చెల్లెలికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి, తామేదో ఆ ఆస్తిని చెల్లెలికి గిఫ్టుగా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తుంటారు. ఇంకొందరైతే చెల్లెలి వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, దాంట్లో ఒక కొసరు చెల్లెలికి ఇచ్చి, అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించేవారు ఉన్నారు. ఇది వాస్తవం… ఇది దేవుడికి తెలుసు… ఇది మా కుటుంబం అంతటికీ తెలుసు” అని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఆ తర్వాత జగన్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రతి ఏడాది సంక్రాంతి మాదిరి జాబ్ క్యాలెండర్ అని చెప్పిన జగనన్న మాట తప్పారని ఎద్దేవా చేశారు. రెండున్నర లక్షల పైచిలుకు ఉద్యోగాలు, అందులో 23 వేల టీచర్ పోస్టులు భర్తీ కాలేదని, జగన్ ను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్టు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని నిద్రలేచి… సిద్ధం అంటూ బయల్దేరారని ఎద్దేవా చేశారు. ఇంతకుముందు ఎప్పుడైనా జగన్ ఇలా జనాల్లోకి వచ్చారా? అని ప్రశ్నించారు.