వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైయస్ రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియా అట్లూరితో రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి నిశ్చితార్థం, వివాహం తేదీలను వైఎస్ షర్మిల వెల్లడించారు. తన కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థం జరగబోతుందని, ఫిబ్రవరి 17న వివాహం జరగబోతుందని షర్మిల ట్వీట్ చేశారు. జనవరి 2వ తేదీన ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను కాబోయే వధూవరులు కుటుంబ సమేతంగా సందర్శిస్తారని ఆమె చెప్పారు.
వివాహ ఆహ్వాన పత్రికను నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ఉంచి ఆశీస్సులు తీసుకుంటామని ట్వీట్ చేశారు. తన కుమారుడి నిశ్చితార్థం, పెళ్లి గురించి తెలియజేసినందుకు సంతోషంగా ఉందని షర్మిల అన్నారు. దీంతోపాటు, ప్రజలకు షర్మిల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక, రాజారెడ్డి- అట్లూరి ప్రియల వివాహ వేడుకకు ఏర్పాట్లు చకచగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, అట్లూరి ప్రియకు వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ బంగారు గాజులు తొడిగిన ఫోటో కొద్ది రోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, అట్లూరి ప్రియా-రాజారెడ్డిల వివాహం గురించి వైఎస్ షర్మిల స్పందించడం ఇదే తొలిసారి. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న రాజారెడ్డి- ప్రియల ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. అమెరికాలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చదువుతున్న సమయంలో ప్రియతో రాజారెడ్డికి పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు కొనసాగింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియా అట్లూరికి అమెరికా పౌరసత్వం కూడా ఉంది.