హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక విచారణకు రాగా.. కాదు ప్రత్యర్థులే హతమార్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించారంటూ క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలది మరణంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన పోస్ట్ చేశారు.
`పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని .. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రవీణ్ పగడాల గారి మృతి పై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలి. నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న.` అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
కాగా, ఇప్పటికే పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటనను ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. వీణ్ అనుమానాస్పద మృతిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరపాలని సీఎం చంద్రబాబు డీపీజీని ఆదేశించారు. అలాగే ఈ కేసును పూర్తి సమాచారంతో దర్యాప్తు జరపాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మంత్రి లోకేష్.. పాస్టర్ ప్రవీణ్ హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.