మొత్తానికి కోనసీమలో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చేశారు. కర్ఫ్యూ వాతావరణం ఉంది ఇప్పుడక్కడ. పోలీసు అండతో వాడి నీడతో అక్కడ రూలింగ్ నడుస్తోంది. ఇంతకూ రూలింగ్ పార్టీ ఎక్కడుంది.. ఏం చేస్తుంది. తప్పు ఏదయినా కానివ్వండి ఈ ఘటనలో ఆరోపణలు ఎక్కువగా ఓ వర్గం కు చెందిన వారిపైనే ఉన్నాయి. ప్రశాంత కోనసీమ పరువు తీశారు కద రా అని ఇప్పుడంతా సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు.
తెలంగాణ వాళ్లు సైతం ఆ రోజు మాకు నీతులు చెప్పి ఇప్పుడు మీకేం అయిందని, అది ఉద్వేగ సంబంధ ఉద్యమం అయితే, ఇది ఉద్దేశ సంబంధ దమన కాండ అని కొందరు కోనసీమ లో రగులుతున్న రావణ కాష్టంపై స్పందించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిక కాపులు, ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిక దళితులు ఒక్కసారి ఆలోచించుకుంటే ఏ తగాదా ఉండదు అన్న వాదన కూడా ఉంది.
కులాల వారీగా మనుషులు వారి ఊసులు వినపడడం ప్రమాదకరం. రాజ్యాంగం అందించిన ఫలాలు అనుభవిస్తున్న వారంతా అంబేద్కర్ కు రుణపడి ఉండాల్సిందే అన్నది ఇంకొందరి అధికార పార్టీ వర్గాల వాదన.
ఇక మరోవైపు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. కాపులూ, దళితులూ మధ్య సఖ్యత ఎక్కడికీ పోదు అని అనవసరంగా రాద్ధాంతం చేసేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇంకాచెప్పాలంటే ఓ హత్యోదంతంలో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంత బాబు అమానవీయ చర్య నుంచి జనం దృష్టిని మరల్చేందుకే ఇలాంటివి చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. వినిపిస్తున్నాయి.
ఏదేమయినా సాధ్యమయినంత త్వరగా ప్రశాంత సీమలో శాంతి పరిఢిల్లాలని కోరుకోవడమే కాదు..అందుకు తగ్గ చర్యలకు అంతా కలిసి సహకరించాలి అని కాపునాడు పెద్దలు సైతం కోరుతున్నారు.