ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలపై చాలానే కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలనేదే వైసీపీ లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం జగన్.. నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికలు ఎలా ఉన్నా.. 175 స్థానాల్లోనూ మన జెండా ఎగరాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. పట్టు కోల్పోతే.. కష్టమని కూడా హెచ్చరించారు.
దీంతో నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అయితే.. కొన్ని చోట్ల చాలా వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. దీనిని అధిగమించేందుకు నేరుగా కీలక నేతలను కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు.
ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత జగన్ పెట్టిన టార్గెట్ 175పై పలువురు నాయకులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికి కారణం లేకపోలేదు. వచ్చే ఎన్నికలను అత్యంత పటిష్టంగా జనసేన, టీడీపీ, బీజేపీలు కూడా భావిస్తున్నాయి. గెలుపు గుర్రం ఎక్కాలనే తపన టీడీపీలోనూ కనిపిస్తోంది.
ఈక్రమంలో అసాధారణ రాజకీయాలు ముందుకు సాగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అంటే.. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి రంగంలోకి దిగే ఛాన్స్‌ను వైసీపీ నాయకులు తోసిపుచ్చలేక పోతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలపై బలమైన కసరత్తు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగా ఎన్నికలు ఎంత టఫ్‌గా ఉన్నా.. 110 స్థానాల్లో అయినా బలంగా గెలిచి తీరాలనేది పార్టీ నేతలు నిర్దేశించుకున్న తాజా లక్ష్యమని అంటున్నారు. దీనిలో సీమను వారు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
సీమలో గత ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం దక్కించుకుంది. కుప్పం, హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు మినహా ఎక్కడా పోటీ ఇవ్వలేక పోయింది. సో.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితిని సాధించాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే.. పదే పదే సీమ నేతలను జగన్ హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా .. కృష్ణా, నెల్లూరు జిల్లాలపైనా.. ఆశలు బాగానే ఉన్నాయి.
ఇక, ఉత్తరాంధ్ర విషయానికి వస్తే.. సగం సీట్లయినా.. ఈ దఫా కొల్లగొట్టాలని.. నిజానికి గత ఎన్నికల్లో టీడీపీ 5 స్థానాల్లో విజయం దక్కించుకుంది. టెక్కలి, విశాఖలోని నాలుగు నియోజకవర్గాలు ఆ పార్టీకి దక్కాయి. ఇది వచ్చే ఎన్నికల్లో మారే ఛాన్స్ ఉంది. టీడీపీ గ్రాఫ్ పెరుగుతున్న దరిమిలా.. ఇక్కడ సగం దక్కించుకుని.. సీమలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తే.. కోస్తాలో ఆశించిన స్థాయి సత్తా చూపినా.. చాలని.. ఎంత టఫ్ ఫైట్ ఉన్నా.. 110 స్థానాలు తమకు దక్కడం ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది.
ఇక, పోటీ లేకపోతే.. అంటే.. ఎవరికివారు పోటీ చేస్తే.. అప్పుడు ఖచ్చితంగా 160 స్థానాలను లక్ష్యంగా పెట్టుకోవాలని.. సీనియర్లు భావిస్తున్నారు. ఎలా చూసినా.. 175 కు 175 కాకపోయినా.. టఫ్ ఉంటే 110, లేకుంటే 160 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తున్నారు. మరి ఈ తాజా లెక్కలు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.