ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం శవ రాజకీయాలకు కేరాఫ్ గా మారిపోయారు. టీడీపీ కూటమి వచ్చాక నలభై మంది రాజకీయ హత్యకు గురయ్యారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బ తిన్నాయని కొద్ది నెలల క్రితం జగన్ ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హత్యకు గురైన వారి వివరాలు అడిగితే మాత్రం జగన్ నోరు మెదపలేదు. తాజాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పుంగనూరు మైనార్టీ బాలిక హత్య కేసులో కూడా జగన్ మరియు ఆయన పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం విమర్శలకు దారి తీసింది.
పుంగనూరులో సెప్టెంబర్ 29న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వెళ్తున్న ఆస్పియా(7) అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు, పోలీసులు ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. చివరకు పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభించడంతో.. చిన్నారి మృతి కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనను ప్రభుత్వం ఎంతో సీరియస్‌గా తీసుకుంది. సర్కార్ ఒత్తిడితో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారంలో ఏర్పడిన గొడవల వల్ల ప్రత్యర్థులు చిన్నారిని చంపేశారు.
పాపపై ఎటువంటి అత్యాచారం జరగలేదని.. నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని ఎస్పీ మణికంఠ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఓ మహిళతో సహా మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు. కానీ ఇంతలోనే జగన్ అండ్ బ్యాచ్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పుంగనూరు ఘటనపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం ప్రారంభించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా బాలికపై నలుగురు హత్యాచారానికి పాల్పడ్డారంటూ వైసీపీ ఓ తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. పైగా ఓవైపు ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతుంటే.. ప్రభుత్వం చిన్నారి కేసును పట్టించుకోవడం లేదంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని నేరాలు ఘోరాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆనాడు జగన్ ఎప్పుడూ నోరు మెదపలేదు. ముఖ్యమంత్రిగా బాధిత కుటుంబాలను పరామర్శించింది లేదు. నేరాల్లో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆధారాలు బయటకువచ్చినా.. జగన్ మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించారు. అదే జగన్ నేడు జరగని తప్పును కూడా జరిగిందని పదే పదే చెబుతూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. పుంగనూరు చిన్నారి ఘటన ఇందుకు మరో ఉదాహరణగా మారింది. విపక్ష పార్టీగా బాధిత కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి.. తమ స్వార్థం కోసం జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ అసత్య ప్రచారంతో వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని కూటమి నాయకులు మండిపడుతున్నారు. జగన్ ఇక మారడా..? శవ రాజకీయాలు ఆపడా..? అని ప్రశ్నిస్తున్నారు.