ఏపీ సీఎం జగన్‌పై దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మిత్రుడు గోనె ప్రకాష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలోనే జగన్ త్వరలోనే జైలు ఊచలు లెక్కబెట్టడం ఖాయమని అన్నారు. వివేకా హత్య కేసులో త్వరలో జగన్ జైలుకు వెళ్తారని, సీఎం హోదాలోనే జగన్ జైలుకు వెళ్లబోతున్నారని గోనె ప్రకాష్ రావు చెప్పారు. జూన్‌లో వైఎస్ భారతి సీబీఐ విచారణ ఎదుర్కోబోతున్నారని, త్వరలోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని అన్నారు. ఏపీలో పాలన అస్తవ్యస్థంగా తయారైందని, జగన్ జనాన్ని కలవరని, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వరని గోనె ప్రకాష్ ఆరోపించారు.
సతీమణి భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ మోహన్ రెడ్డిదూరంగా పెట్టారని గోనె ప్రకాష్ రావు చెప్పారు. తాను జైలుకు వెళ్తే భార్య భారతిని సీఎం చేయాలనేదే జగన్ వ్యూహమన్నారు. షర్మిల పోలీసులను కొట్టారని తానో వీడియోలో చూశానని.. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని చెప్పుకొచ్చారు. ‘‘షర్మిల నా కూతురు లెక్క.. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడను’’ అని తెలిపారు. షర్మిల రోడ్డెక్కడానికి కారణం ఎవరు..? జగన్ కాదా అని ప్రశ్నించారు.
షర్మిల పక్క రాష్ట్రానికి వెళ్లి పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. జగన్ షర్మిలను చిత్రహింసలు పెడుతున్నారన్నారు. ఏపీలోని ఓ సిట్టింగ్ ఎంపీ షర్మిలను కలిశారని.. ఆమెకు సాయం కింద రూ.5 కోట్లు ఇస్తామన్నారని తెలిపారు. అయితే ఆ విషయం తెలుసుకున్న జగన్.. సదరు ఎంపీకి ఫోన్ చేసి.. ఎందుకెళ్లావ్..? సాయం చేయాల్సిన అవసరమేం ఉందని బెదిరించారని అన్నారు.
షర్మిల ఇంటి వద్ద ఏపీ ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ వాళ్లను పెట్టినట్టు తనకు సమాచారం ఉందని గోనె చెప్పారు. జగన్‌ను ఇబ్బంది పెట్టకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేసుకుంటున్న షర్మిల మీద ఎందుకంత కోపమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఇక్కడ పార్టీ పెడితే ఏమవుతుంది జగన్ పరిస్థితి అని ప్రశ్నించారు. ‘‘షర్మిల నా కూతురు లెక్కే కానీ.. జగన్ కొడుకు లెక్క కాదు’’ అని అన్నారు.