వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేందుకు కీలక పాత్ర పోషించిన ఆయన సోదరి.. వైఎస్ షర్మిలకు సీఎం జగన్‌కు మధ్య ఇప్పుడు మాటలు లేవని చెబుతున్నారు. ముఖ్యంగా ఇద్దరూ ఒకరికొకరు ఎదురు కూడా పడడం లేదు. ఈ పరిణామాలతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో రాజకీయం రాజుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
తాను వద్దని చెప్పినా.. షర్మిల పార్టీ పెట్టడం.. అన్న సీఎం అయ్యాక.. తనకు ఎలాంటి గుర్తింపు లేకుండా చేశారని.. షర్మిల ఆవేదన వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు.. తెరచాటున జోరుగానే నడుస్తున్నాయి.
అయితే.. అనూహ్యంగా ఇద్దరూ కూడా ఎదురు పడాల్సిన సందర్భాలు కూడా వస్తున్నాయి. అదే.. షర్మిల, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతులు. గత జూలై 9న వైఎస్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అప్పటికే పార్టీని ప్రకటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. అయితే.. పార్టీ వద్దని తాము చెప్పినట్టు జగన్ బహిరంగంగా ప్రకటించుకున్నారు.
ఈ నేపథ్యంలో కడప జిల్లాలోని ఇడుపుల పాయలో ఉన్న వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించే కార్యక్రమానికి ఇరువురు నేతలు కూడా వేర్వేరుగా హాజరయ్యారు. ఒకరి షెడ్యూల్లో ఒకరు ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
వాస్తవానికి ఇప్పటి వరకు కూడా వైఎస్ జయంతికి.. ఇద్దరు అన్నాచెల్లెళ్లు.. కలిసి ప్రార్ధనలు చేసేవారు. కానీ, తొలిసారి ఈ ఏడాది జరిగిన జయంతికి వేర్వేరుగా నివాళులు అర్పించారు. ఇది రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక, ఇప్పుడు.. మరోసారి ఇలాంటి ఘటనకు అవకాశం ఏర్పడింది. మరో రెండు రోజుల్లో వైఎస్ వర్ధంతి (సెప్టెంబరు 2) జరగనుంది.
దీనికి సంబంధించి.. కూడా ఇద్దరు నేతలు వేర్వేరుగా షెడ్యూళ్లు ఏర్పాటు చేసుకున్నారు. జగన్‌కు తారస పడకుండా.. షర్మిల, షర్మిలకు ఎదురు పడకుండా.. జగన్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. దీంతో మరోసారి ఇడుపుల పాయ రాజకీయం.. రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.