వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ఒకరు.. ఎలాగైనా సరే వైసీపీని గెలిపించి.. మరోసారి జగన్ను ముఖ్యమంత్రిగా చూసేందు కు మరొకరు.. ఇలా వైఎస్ కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సీఎం జగన్ సోదరి షర్మిల.. వైసీపీని ఓడించి తీరుతానని చెబుతున్నారు. సీఎం జగన్కు ఓటేయొద్దని చెబుతున్నారు. వైసీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని అంటున్నారు. దీనికితోడు సొంత బాబాయి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తద్వారా.. వైసీపీకి, సీఎం జగన్కు కంచుకోట వంటి కడపలో ప్రభావం చూపించేలా వైఎస్ షర్మిల చాలా వ్యూహాత్మకంగాపావులు కదుపుతున్నారు. మొత్తంగా వైసీపీ నైతిక ఓటమి కోసం షర్మిల వర్గం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే.. ఇప్పుడు ఇదే కుటుంబం నుంచి వైఎస్ విమలా రెడ్డి రంగంలోకి దిగారు. ఈమె ప్రభువు భక్తురాలు. కడపలో పెద్ద చర్చిని కూడా నిర్మించారు. ఇప్పుడు ఈమె వైసీపీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు రెడీ అయ్యారు.
విమలారెడ్డికి క్రైస్తవ సంఘాల్లో మంచి పేరుంది. రాష్ట్ర వ్యాప్త పాస్టర్ల సంఘంతోనూ విమలారెడ్డి టచ్లో ఉన్నారు. ఈమెకు జగన్ అంటే వల్లమాలిన ప్రేమ. వరుసకు మేనత్త అవుతుందని అంటారు. విమలారెడ్డి లక్ష్యం.. ప్రస్తుత ఎదురీతల నుంచి వైసీపీని ఒడ్డుకు చేర్చడమేనని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన ఎస్సీ , ముఖ్యంగా క్రైస్తవ ఓటు బ్యాంకు వైసీపీకి దూరంగా జరగకుండా.. చూసేందుకు విమలా రెడ్డి రంగంలోకి దిగారని సమాచారం. తాజాగా ఆమె విజయవాడలో క్రైస్తవ పాస్టర్ల సంఘం నాయకులతో భేటీ అయ్యారు.
రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ని ఎందుకు గెలిపించాలి అనే అంశంపై పాస్టర్లతో చర్చలు జరిపారు. జగన్ ప్రభుత్వ అవసరాన్ని ఆమె నొక్కి చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలంటూ విమలారెడ్డి ప్రార్థనలు చేశారు. జగన్ను గెలిపించకపోతే క్రైస్తవులకు ఇబ్బందులు ఎదురవుతాయని విమలారెడ్డి పేర్కొన్నారు. జగన్ సీఎంగా కొనసాగకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కూడా పేర్కొన్నారు. కాగా, విజయవాడలో విమలారెడ్డి కుటుంబానికి ప్రముఖ రాజ్ యువరాజ్ థియేటర్ ఉన్న విషయం తెలిసిందే.