మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు టీవీ సీరియల్ లాగా ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగిన ఈ హత్య కేసు విచారణ జగన్ సీఎం అయిన నాలుగున్నరేళ్ల తర్వాత కూడా ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసులో సిబిఐ దూకుడుగా విచారణ జరుపుతున్నప్పటికీ అసలు నిందితులు మాత్రం పూర్తి స్థాయిలో తెరపైకి రాలేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పై బయట ఉండగా…ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి బెయిల్ దక్కలేదు.
చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు…భాస్కర్ రెడ్డికి షాక్ ఇచ్చింది. ఆయనతోపాటు ఈ కేసులో మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. వారి బెయిల్ పిటిషన్లను కింది కోర్టు గతంలోనే తిరస్కరించడంతో వారు తెలంగాణ హైకోర్టులో ఆ తీర్పును అప్పీల్ చేశారు. వారి అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి మరోసారి బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన పులివెందులలో వైఎస్ భాస్కర్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంచారు. వీరికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వివేకా తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక, ఈ కేసులో మరో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.