షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఈ మధ్యన ఊపందుకోవటం.. పలు పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ దారుణ హత్యలో మొదట్నించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఈ ఉదయం (ఆదివారం) అరెస్టు చేశారు.
ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు పులివెందులకు చేరుకున్నారు. అనంతరం భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకున్న అధికారులు. అనంతరం భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. రెండు రోజుల క్రితం ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా పేరున్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేయటం తెలిసిందే.
ఆయన అరెస్టును టెక్నాలజీ సాయంతో చేపట్టిన వైనం బయటకు వచ్చింది. వివేకా హత్యకు ముందు భాస్కర్ రెడ్డి నివాసంలోనే ఉదయ్ ఉన్నట్లుగా గూగుల్ టెక్ అవుట్ ద్వారా గుర్తించిన సీబీఐ.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించింది. ఉదయ్ అరెస్టు జరిగిన రెండు రోజులకే ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని అధికారులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. తొలుత ఎంపీ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినట్లుగా ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ లేదని అవినాశ్ ఇంటి సెక్యురిటీ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి పలు కీలక పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎంపీ తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుతో పులివెందుల ఉలిక్కిపడింది. రానున్న రోజుల్లో ఎంపీ అవినాశ్ అరెస్టు తప్పదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. సంచలనాలకు కేంద్రంగా మారిన వివేకా హత్య కేసులో తదుపరి పరిణామాలు వేగంగా ఉండే వీలుందన్న మాట వినిపిస్తోంది.